పదవి లేనప్పుడే జగన్కు జనం కనిపిస్తున్నారు
ప్రమాదం వెనుక కుట్ర కోణం ఉందని అనుమానం: టీడీపీ
అమరావతి, జనవరి 9(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్ ఏనాడైనా పరామర్శకు వెళ్లారా? అని తెలుగుదేశం పార్టీ ప్రశ్నించింది. గురువారం ఇక్కడ ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య విలేకరులతో మాట్లాడారు. ‘జగన్ సీఎంగా ఉండగా తిరుపతి రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక 21 మంది చనిపోతే చూడటానికి వెళ్లలేదు. అన్నమయ్య ప్రాజెక్టు గేటు కొట్టుకుపోయి 33 మంది చనిపోతే పరామర్శకు వెళ్లలేదు. గోదావరిలో కచ్చలూరు వద్ద బోటు ప్రమాదంలో 39 మంది చనిపోతే కన్నెత్తి చూడలేదు. అధికారంలో ఉన్నప్పుడు ఈ ఘటనలు కనిపించలేదా’ అని వర్ల రామయ్య ప్రశ్నించారు. తొక్కిసలాట ఘటన వెనుక కుట్ర కోణం ఉందన్న అనుమానం తమకు ఉందన్నారు. ‘భక్తులు ఒకేసారి తోసుకొని రావడం వెనుక గంజాయి మూక పదిహేను మంది ఉన్నారని తెలుస్తోంది. ముందున్న వారిని తోయడంతోపాటు గట్టిగట్టిగా కేకలు పెట్టి, అరిచి క్యూలైన్లలో గందరగోళం సృష్టించారని, వీరే ఈ తోపులాటకు కారణమయ్యారని గుర్తించారు. ఘటన జరిగిన నిమిషాల వ్యవధిలో జాతీయ మీడియాకు సమాచారం పంపారు. దీనిపై కూడా మాకు అనుమానం ఉంది. దీనిపై విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నాం’ అని వర్ల అన్నారు.