పెండింగ్‌ బిల్లులు చెల్లించాలని కాంట్రాక్టర్ల డిమాండ్‌.. కమిషనర్‌ గేటు వద్ద 3 గంటలపాటు నిరసన

  • పెట్రోలు పోసుకొని ఆత్మహత్యాయత్నం

  • మరో గేటు వద్ద మొండేదార్‌ సంఘం ప్రతినిధుల ధర్నా

  • జియాగూడాలో కబేళా నిర్మించాలంటూ డిమాండ్‌

  • కార్యాలయం 2 గేట్ల వద్ద ధర్నాలు

  • జూన్‌లో చెల్లిస్తాం.. వచ్చేనెల రూ.500 కోట్లు వస్తాయి

  • కాంట్రాక్టర్లతో మాట్లాడిన కమిషనర్‌

హైదరాబాద్‌ సిటీ/కవాడిగూడ, జనవరి 9 (ఆంధ్రజ్యోతి): లోయర్‌ ట్యాంక్‌బండ్‌లోని జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. పెండింగ్‌ బిల్లులు చెల్లించాలంటూ కమీషనర్‌ గేటు వద్ద జీహెచ్‌ఎంసీ పరిధిలో వివిధ పనులు చేసిన కాంట్రాక్టర్లు ప్లకార్డులు పట్టుకొని మెరుపు ధర్నా నిర్వహించారు. ఈ క్రమంలో ఓ కాంట్రాక్టర్‌ ఒంటిపై పెట్రోల్‌ పోసుకున్నాడు. అప్రమత్తమైన తోటి కాంట్రాక్టర్లు, పోలీసులు ఆయన ఒంటిపై నీళ్లు చల్లారు. అనంతరం ఆస్పత్రికి తరలించారు. దాదాపు మూడు గంటలపాటు కాంట్రాక్టర్లు బల్దియా ఆఫీస్‌ వద్ద బైఠాయించారు. బకాయిలు వెంటనే చెల్లించాలని.. లేదంటే పనులు చేసేది లేదని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కాంట్రాక్టర్ల సంఘం నాయకులు మాట్లాడుతూ.. ఏడాదిగా రూ.1200 కోట్ల మేర బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని, ఈ విషయంపై మాట్లాడేందుకూ కమిషనర్‌ సమయమివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. పలుమార్లు కలిసేందుకు ప్రయత్నించినా అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదని, అందుకే ధర్నా చేయాల్సి వచ్చిందన్నారు.

ఇప్పటి వరకు పెండింగ్‌లో ఉన్న బిల్లులన్నీ చెల్లించాలని డిమాండ్‌ చేశారు. కాగా జియాగూడ కబేళా నిర్మాణం వెంటనే చేపట్టాలని అరె కటిక మొండేదార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో బల్దియా కార్యాలయంలోని మేయర్‌ గేటు వద్ద ధర్నా చేపట్టారు.ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ.. జియాగూడ కబేళాపై ఆధారపడి వేల కుటుంబాలు జీవిస్తున్నాయని, సరైన వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. మానవతా దృక్పథంతో ప్రభుత్వం స్పందించి కబేళా నిర్మించాలని కోరారు. కాగా అటు కాంట్రాక్టర్లు, ఇటు ఆరె కటిక మొండేదార్‌ సంఘం ప్రతినిధులు రెండు గేట్ల వద్ద ఏకకాలంలో ధర్నా చేయడంతో బల్దియా కార్యాలయంలోకి రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఇలంబరిది సచివాలయంలో జరగాల్సిన సమావేశానికి వెళ్లాల్సి ఉన్నా ఆఫీసు దాటి బయటకు వెళ్లలేకపోయారు. కొద్దిసేపటి తర్వాత.. కాంట్రాక్టర్ల సంఘం ప్రతినిధులతో కమిషనర్‌ మాట్లాడారు. జూన్‌ వరకు బకాయిలను ట్రేడ్స్‌ ద్వారా చెల్లిస్తామని, వచ్చేనెల నుంచి ప్రభుత్వం నెలకు రూ.500 కోట్లు ఇచ్చే అవకాశం ఉందని, మున్ముందు పెండింగ్‌ లేకుండా బిల్లుల చెల్లింపులు జరుగుతాయని చెప్పారు.

By News99

Verified by MonsterInsights