-
మాజీ ఎమ్మార్వో, బ్యాంకు మాజీ మేనేజర్ సహా 11 మంది అరెస్ట్
గుంటూరు, జనవరి 9(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీని క్యాష్ చేసుకొనేందుకు నకిలీ పట్టాదారు పాస్‌పుస్తకాలు సృష్టించి 5కోట్లు స్వాహా చేసిన కేసులో 11మందిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల్లో మాజీ ఎమ్మార్వో, బ్యాంకు మాజీ మేనేజర్ ఉన్నారు. ఎస్పీ సతీష్‌కుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నిందితులు నకిలీ పట్టాదారు పాసు పుస్తకాలు, 1బి అడంగల్, ఆధార్ కార్డులు, పాన్‌కార్డులు సృష్టించి, నకిలీ సర్వే నంబర్లు, విస్తీర్ణాలను ప్రభుత్వ వెబ్‌సైట్లలో ఎక్కించేవారు. రుణం తీసుకున్న తర్వాత ఆ వివరాలను వెబ్‌సైట్ల నుంచి తొలగించేవారు. ఈ విధంగా సుమారు 5కోట్లు స్వాహా చేసినట్టు తేలిందని ఎస్పీ చెప్పారు. ఈ కేసులో మాచవరం మాజీ తహసీల్దార్ గడినపూడి లెవి, జీడీసీసీ బ్యాంకు ప్రత్తిపాడు బ్రాంచ్ మాజీ మేనేజర్ బొల్లినేడి రవికుమార్, అప్పటి కావూరు సొసైటీ కార్యదర్శి సోమేపల్లి నాగరాజు సహా 11 మందిని అరెస్టు చేశారు. దర్యాప్తు అనంతరం మిగిలిన నిందితులను కూడా అరెస్టు చేస్తామని ఎస్పీ చెప్పారు.